నమస్తే శేరిలింగంపల్లి: టైప్ -1 డయాబెటిస్ వ్యాధితో చాలా మంది బాధపడుతున్నారని అలాంటి వారికి సహాయం చేయడానికి ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వీట్ సోల్స్ స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం అభినదనీయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. టైప్ 1 డయాబెటిస్ వ్యాధి ప్రాథమిక అంశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి స్వీట్ సోల్స్ స్వచ్ఛంద సంస్థ రూపొందించిన బ్రోచర్ ను ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టైప్ 1 డయాబెటిస్ ఉన్న వ్యక్తులు, టైప్ 1 డి ఉన్న పిల్లల తల్లిదండ్రులు కలిసి ఏర్పాటు చేసుకున్న లాభ పేక్ష లేని సంస్థ అని, టైప్ 1 డయాబెటిస్ ఉన్న వ్యక్తులకి రోజుకు నాలుగు కంటే ఎక్కువ సార్లు ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోవడం తప్పనిసరి అన్నారు. ఈ విషయంలో అవగహన లేక ఇన్సులిన్ తీసుకోకపోవడం వల్ల, ఆలస్యంగా నిర్ధారించడం వల్ల ప్రాణానికే ప్రమాదమని చెప్పారు. ప్రజలలో విస్తృత అవగహన కలిపించాలనే ఉద్దేశంతో స్వీట్ సోల్స్ సంస్థ సంబంధిత డాక్టర్ ల సహాయంతో ఈ బ్రోచర్ ను తయారు చేశారన్నారు. ప్రభుత్వం తరుపున, తన వంతుగా ఎలాంటి సహాయ సహకారమైనా అందజేస్తామన్నారు. స్వీట్ సోల్స్ సంస్థ ప్రతినిధులు శిరీష మంథా, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ చౌట, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, నాయకులు అనిల్ తదితరులు పాల్గొన్నారు.