నమస్తే శేరిలింగంపల్లి: స్టాలిన్ నగర్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా చూస్తామని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ పేర్కొన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్ లో బిజెపి నాయకులు పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ కాలనీలో ఎక్కడ చూసినా తవ్వి వదిలేసిన రోడ్లు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు దర్శనమిస్తున్నాయని అన్నారు. అధ్వాన్నంగా మారిన రోడ్లమీద ప్రజలు నడిచే పరిస్థితి లేదని, వీధి దీపాలు లేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. గతంలో మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ ఆధ్వర్యంలో వేసిన బోర్లు పాడవడంతో పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించని పక్షంలో తమ సొంత నిధులతో ఈ బోర్లను మరమ్మతు చేయిస్తామని రవి కుమార్ యాదవ్ తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న పోచమ్మ, ఎల్లమ్మ ఆలయాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో కొంతమంది యువకులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, త్వరలోనే ఆలయ అభివృద్ధికి తమ సహాయ సహకారాలు ఉంటాయన్నారు. కాలనీలో తమ దృష్టికి వచ్చిన సమస్యలన్నింటి పై సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా నాయకులు నాగులు గౌడ్, కంటెస్టెంట్ కార్పొరేటర్ రాఘవేంద్ర రావు, మాణిక్, వినోద్ యాదవ్, గణేష్ ముదిరాజ్, రామకృష్ణారెడ్డి, బాబు, శివరాజ్, ముఖేష్ వెంకటేష్, రాము, శీను, అజయ్, అభిషేక్, వెంకట్, గురు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
