నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ ఉన్న శ్రీకర ఆసుపత్రిలో రూ. 50 లక్షల అంచనావ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఈసీఎంఓ(Extra Corporeal Membrane Oxygenation) వైద్య పరికరాన్ని కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్‌లతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ కరోనా పరిస్థితులలో అత్యాధునిక వైద్య సేవలందించేందుకు ఈ పరికరం ఎంతగానో తోడ్పడుతుందన్నారు. తీవ్రమైన గుండె సంబంధిత వ్యాదిలుతో బాదపడుతున్న వారికి, కరోనా కారణంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న వారికి ఈసీఎంఓ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఇలాంటి పరికరంతో వైద్యసేవలు అందించేందుకు ముందుకు వచ్చిన శ్రీకర యాజమాన్యాన్ని వారు అభినందించారు. స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పురుషోత్తం యాదవ్, వాలా హరీష్ రావు , లక్ష్మారెడ్డి , శ్రీకర అసుపత్రి ఛైర్మెన్ అఖిల్ దాడి , డైరెక్టర్ రమ సరస్వతి, డాక్టర్ వెంకట విజయ్ , ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.