నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ వేంకటేశ్వరాలయ సముదాయంలో ఉగాది ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ప్లవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీ పద్మావతీ, గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానంగా సుప్రభాత సేవ, విస్వక్షేన పూజ, పుణ్యావాహచనం, పంచామృతములతో, పండ్ల రసములతో, డ్రైఫ్రూట్స్‌తో విశేష మహాభిషేకం నిర్వహించారు. తదనంతరం విశేష మహా పుష్పాలంకారణలో స్వామివారు, అమ్మవార్లు భక్తులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ మహారాజపోషకులు, ఆలయ పాలకమండలి సభ్యులు, దాతలతో పాటు పరిసిర ప్రాంత భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి దర్శించుకుని తీర్ధ ప్రసాధములు స్వీకరించారు.
ప్లవ నామ సంవత్సరంలో అంత మంచే…
ఆలయ ప్రధాన అర్చకులు, పీఠం రాష్ట్ర ఆగమ సలహాదారు సుదర్శనం సత్యసాయి ఉగాదిని పురస్కరించుకుని పంచాంగ పఠనం చేశారు. ప్లవ అంటే, దాటించునది అని అర్థమని, “దుర్భిక్షాయ ప్లవ ఇతి తతశ్శోభనే భూరితోయం అని అని వరాహసంహితలో పేర్కొన బడిందని, అంటే “దుర్భరమైన ప్రతికూలతను దాటించి భూమికి శోభను చేకూరుస్తుందని అర్థమన్నారు. గతంలోని వికారి, శార్వరి నామ సంవత్సరాలు తమ పేర్లకు తగ్గట్టుగా కొనసాగాయని, ప్లవ తన పేరును సార్థకం చేసుకుంటుందని ఆశించటం తర్కసహితమైన ఆలోచన అని అన్నారు. ఐతే ప్లవ నామ సంవత్సరం ముగియగానే “శుభకృత్”, ఆ తరువాతది “శోభకృత్” సంవత్సరములని, పేరుకు తగ్గట్టుగా అవి కూడనూ మనకు సంతోషాన్ని, వికాసాన్ని కలిగిస్తుందని ఆశాబావం వ్యక్తం చేశారు.