శేరిలింగంపల్లి, మార్చి 24 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రకృతి ప్రళయతాండవం చేస్తుందని, మూడవ ప్రపంచ యుద్ధం తప్పదని, దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసేందుకు కల్కి జన్మించేశాడని, జన్మించి 19 సంవత్సరాలు కావొస్తోందని విశ్వ సనాతన సేవా ట్రస్ట్ అధ్యక్షుడు, పండిట్ కాశీనాథ్ మిశ్రా అన్నారు. 600 సంవత్సరాలు పూర్వం అచ్యుతానంద దాస్ రచించిన భవిష్య మాలికలో ఈ ఉదంతాలన్నీ వున్నాయని తెలిపారు. ఈ విషయాలన్నీ మార్చి 26, 2025న సాయంత్రం 6 గం.లకు అన్నమాచార్య భావనా వాహిని వారు నిర్వహించనున్న 522వ అన్నమయ్య ఆరాధనలో సమగ్రంగా తెలుపనున్నారు. దగ్గరి భవిష్యత్తులో జరుగనున్న ఈ విపత్తుల నుండి రక్షణ పొందేందుకు అనుసరించవలసిన మార్గాలు, కల్కి భగవానుని దర్శనం, యిత్యాది విషయాల గురించి ఆయన పురాణేతిహాసముల ఆధారములతో వివరించనున్నారు.
శ్రీ వేంకటేశ్వరుడే కల్కి అవతారమని అన్నమయ్య ఎన్నో కీర్తనలు పాడారని, వేంకటేశ్వరుడు అర్చా మూర్తి అయితే, అతని తేజో రూపం మానవాకృతి దాల్చి అతి త్వరలో రానున్నారని తానెంతో సంతోషిస్తున్నట్లు చెప్పారు డా. శోభారాజు. కల్కి చేపట్టినది కూడా శ్రీ నందకమని, ఆ శ్రీ నందకాంశ సంభూతుడే అన్నమయ్య అని తెలిపారు. సాయంత్రం 6గం.లకు అన్నమాచార్య భావనా వాహినిలో శిక్షణ పొందిన గాయినీ గాయకులు మధుర అన్నమయ్య సంకీర్తనలతో కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇందులో బెంగళూరు నుండి ధర్మ సాధన సమస్త సంస్థ అధినేత మోహన్ సుందర్, భూవనేశ్వర్ నుండి మోహన్ బెహెరా, ఆనెగొంది నుండి రామయోగి, హైదరాబాద్ ప్రొఫెసర్ ముళ్లపూడి సత్యనారాయణ మూర్తి పాల్గొంటారన్నారు. ప్రవేశం ఉచితమని, హాజరు కావాలనుకునే భక్తులు 984802402లో సంప్రదించాలని సూచించారు.