నమస్తే శేరిలింగంపల్లి: చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా పురస్కరించుకుని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాషాయం జెండాలతో ఘనంగా శోభాయాత్రను నిర్వహించారు. చత్రపతి శివాజీ 392వ జయంతోత్సవాన్ని పురస్కరించుకుని మియాపూర్ నుండి లింగంపల్లి తుల్జా భవాని ఆలయం వరకు నిర్వహించిన శోభాయాత్రలో బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ జ్ఞానేంద్ర ప్రసాద్, యోగానంద్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 17 ఏళ్ళ వయసులోనే శివాజీ మొట్టమొదటగా యుద్ధం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్న వీరుడన్నారు. సుల్తాన్, మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి ఔరంగజేబును సైతం వణికించిన చత్రపతి శివాజీ యుద్ధతంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలోనూ అగ్రగణ్యుడిగా పేరు ప్రతిష్టలు సాధించారని అన్నారు. రాజ్యంలో మంత్రిమండలి, విదేశాంగ విధానంతోపాటు, గూడఛారి వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిన మేధావి శివాజీ అన్నారు. యువత ఛత్రపతి శివాజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి జిల్లా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, బిజెపి శ్రేణులు, బిజెవైఎం శ్రేణులు, మహిళా మోర్చా నాయకురాలు, తదితరులు పాల్గొన్నారు.