నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరింపజేశాయి. అందులో భాగంగా కర్ణాటక గాత్రం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రవాస భారతీయులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో స్థిర నివాసం ఏర్పరచుకొని భారతీయ కళలను అభ్యసిస్తూ సంప్రదాయాన్ని నిలబెడుతున్న కళాకారులు సూర్య లక్ష్మి, రాగ మయూరి, మాస్టర్ అనీష్ నాగసాయి, కుమారి హాసిని లక్ష్మిలు వర్ణం, గణేశా పంచరత్న, సంగీత సామ్రాజ్య, రామానిన్ను నమ్మిన, హరి హర రామ తదితర పాటలను ఆలపించారు. యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా డిట్రాయిట్ లో నాట్య తరంగిణి కూచిపూడి అకాడమీ ని స్థాపించి ఎందరో కళాకారులను తీర్చిదిద్దుతున్న శైలజ పుల్లెల వారి కుమార్తెలు కుమారి ప్రణవి, కుమారి జాహ్నవి తో కలిసి కూచిపూడి ప్రదర్శన ఇచ్చారు. గజవదన, నారాయణీయం, నటేశ కౌతం, మరకత మణిమయ అంశాలను ప్రదర్శించి ఆహుతులను మెప్పించారు.