నమస్తే శేరిలింగంపల్లిః శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించి అభివృద్ధిలో ముందుంచుతామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ శుక్రవారం శేరిలింగంపల్లి డివిజన్ లో విస్తృత పర్యటన చేశారు. సెంట్రల్ పార్క్ ఫేస్ -1, ఫేస్ -2 కాలనీలలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో నెలకొన్న డ్రైనేజీ అవుట్ లెట్ సమస్యను పరిష్కరించనున్నట్లు చెప్పారు.
ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులను తప్పకుండా కల్పిస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. సుదర్శన్ నగర్ లో రూ.40 లక్షల అంచనావ్యయంతో చేపట్టిన వరద నీటి కాలువ నిర్మాణ పనులను, భాగ్యలక్ష్మీ నగర్ లో రూ. 40 లక్షల రూపాయలతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి పనులను ముమ్మరం చేస్తున్నామని గాంధీ అన్నారు. అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తెచ్చేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకుని వరద నీటి కాలువ పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజలకు మెరుగైన సదుపాయాల కల్పనకు శాయశక్తులా కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు.
ఆయన వెంట ఈఈ శ్రీనివాస్, ఏఈ సునిల్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, నాయకులు పద్మారావు, కృష్ణ యాదవ్, రమేష్, వేణుగోపాల్, గోపాల్, సెంట్రల్ పార్క్ ఫేస్-2 అసోసియేషన్ ప్రెసిడెంట్ రమణి శ్రీరామనేని, సభ్యులు సురేష్, రామకృష్ణ, హరినారాయణ, శ్రీనివాస్, ప్రవీణ్, సాయి, వేణు, రాధా కృష్ణ, జగన్ మోహన్ రెడ్డి, సెంట్రల్ పార్క్ ఫేస్ 1 వాసులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.