శేరిలింగంపల్లి, నవంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారుల ఎంపికను పీజేఆర్ స్టేడియంలో నిర్వహించారు. 100 మీటర్ల పరుగు పందాన్ని జిల్లా అధ్యక్షుడు కొండా విజయ్ కుమార్ ఆదివారం ప్రారంభించారు. 100కు పైగా మహిళా, పురుష క్రీడాకారులు పలు విభాగాల్లో పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారని వర్కింగ్ ప్రెసిడెంట్ నూనె సురేందర్, ప్రధాన కార్యదర్శి స్వాతిగౌడ్ ధర్మపురి తెలిపారు. జనవరి 9, 10 తేదీల్లో నిజామాబాద్లో జరగనున్న రాష్ట్ర చాంపియన్షిప్లో 100 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలియజేశారు. మాస్టర్స్ అథ్లెటిక్స్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభు కుమార్, ఉపాధ్యక్షురాలు కల్యాణి పరిశీలకులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభు కుమార్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా రాష్ట్ర పోటీల్లో అధిక సంఖ్యలో పాల్గొని మంచి పోటీ ఇవ్వాలని, ఎవరి ప్రలోభాలకు లొంగకూడదని, మంచి ప్రతిభ కనబరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి శివలీలారెడ్డి, ఉపాధ్యక్షుడు చిరంజీవులు, ఆర్గనైజింగ్ సెక్రెటరీలు శ్రీనివాస్ ముదిరాజ్, మానసపతి, జాయింట్ సెక్రెటరీలు సుల్తానా, నిరూప్ రెడ్డి, పాట్రన్ జ్ఞానేశ్వర్ గౌడ్ ధర్మపురి, కార్యవర్గ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.






