నమస్తే శేరిలింగంపల్లి: అన్ని దానాల్లోకెల్లా నేత్రదానం గొప్పదని రుజువుచేసింది గరికపాటి వారి కుటుంబం. 93 ఏళ్ల వృద్ధురాలి నేత్రాలను కుటుంబ సభ్యులు చూపు లేని వారి కోసం దానం చేసి తమ ఉదారతను చాటుకున్నారు. శేరిలింగంపల్లి నల్లగండ్ల లక్ష్మీ విహార్ లో నివాసం ఉంటున్న గరికపాటి సరస్వతమ్మ (93) ఈ నెల 5 వ తేదీన ఆదివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న భెల్ నేత్రదాన సంచాలకర్త విజయ హాస్పిటల్ ఎండీ అల్లం పాండురంగారావు సరస్వతమ్మ కుమారుడైన బీహెచ్ఈఎల్ రిటైర్డ్ జీఎం ఆదిశేషును సంప్రదించారు. కుటుంబ సభ్యుల అనుమతితో ఎల్ వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ వారితో మాట్లాడి నేత్రాలను(కార్నియ) దానం చేయించారు. ఈ సందర్భంగా అల్లం పాండురంగారావు మాట్లాడుతూ తమ తల్లి గారి నేత్రాలను దానం చేసి చూపు లేని వారికి చూపును ప్రసాదించాలనుకోవడం గొప్ప విషయం అన్నారు. గరికపాటి కుటుంబ సభ్యులను ఇతరులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సరస్వతమ్మ కుమారులు ఆదిశేషు, మల్లేశ్వర్ రావు, రామారావు, వారి కుటుంబ సభ్యులను అల్లం పాండురంగారావు ప్రత్యేకంగా అభినందించారు.