శేరిలింగంపల్లి, జూన్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వం ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అధికారంలో ఉంటుందని, తాము ఏమీ చేసినా ప్రశ్నించే ప్రసక్తే లేదనే భావనతో ప్రముఖంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు వారికి సంబంధించిన వారి ఫోన్ నంబర్లు సేకరించి వారి వ్యక్తిగత సమాచారం, గ్యోప్యతకు భంగం కలిగించేలా ఫోన్ ట్యాపింగ్ చేసి డా.బి. అంబేడ్కర్ రచించి భారత దేశంచే ఆమోదం పొందిన రాజ్యాంగాన్ని కాలరాస్తూ వ్యవహరించిన తీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసిందే. ఇందులో భాగంగా గత కొంత కాలంగా శేరిలింగంపల్లి డివిజన్ కంటెస్ట్ కార్పొరేటర్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి సామ్యూల్ కార్తీక్ ఫోన్ నెంబర్ ను కూడా టాప్ చేశారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తు చేస్తున్న సిట్ (SIT) అధికారులు ఇప్పటికే పలువురిని విచారించి వారి వివరాలను సేకరించగా తాజాగా సామ్యూల్ కార్తీక్ ను విచారించి వివరాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగ స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.