నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆద్వర్యంలో మియాపూర్ విశ్వనాథ్ గార్డెన్స్‌లో ఆదివారం విజయదశమి ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పోతుకూచి సోమసుందరం ట్రస్ట్ వ్యవస్థాపకులు పి.శ్రీనివాస్, ముఖ్యవక్తగా ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచార ప్రముఖ్ డాక్టర్ అమర్‌నాథ్ రెడ్డిలతో పాటు భాగ్ సంఘచాలక్ సుభాష్ చంద్రబోస్‌లు పాల్గొని ఆయుధ పూజ చేశారు. ఉత్సవంలో భాగస్వాములైన శేరిలింగంపల్లి, జనప్రియనగర్‌లకు చెందిన స్వయం సేవకులు దండ(కర్ర) విన్యాసాలు, వ్యాయమ ప్రదర్శనలతో ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ అమర్‌నాథ్ రెడ్డి మాట్లాడుతూ విజయాలకు ప్రతీకగా జరుగుపునే పండుగ విజయ దశమిని, ఈ పర్వదినాన డాక్టర్‌జీ ఆర్ఎస్ఎస్‌ను స్థాపించడం విశేషమని అన్నారు. భారత దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవాలను జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఐతే చరిత్రలో చెప్పుకున్నట్టు అహింసవాదంతో స్వాతంత్రం వచ్చిందనుకోవడం పూర్తిగా అంగీకరించే అంశం కాదని అన్నారు. ఎందరో మహానుబావుల వీరోచిత పోరాటాలు, త్యాగాలతోనే భారత్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిందని అన్నారు. ఐతే చరిత్రను వక్రీకరించడం వల్ల నిజమైన స్వాతంత్రోధ్యమ వీరులను, ధర్మంకోసం పోరాడిన ఎందరో మహానుబావులను కొత్తతరాలు గుర్తించలేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.
మొప్లా ఘటనలో భాగస్వాములైన మత చాంధసవాదులను 75 సంవత్సరాలు స్వాంతంత్ర సమరయోధులుగా కీర్తించుకోవడం మనదౌర్భాగ్యమని అన్నారు. ఐతే ఇటీవల వారందని ఆ జాబితా నుండి ప్రభుత్వం తొలగించడం శుభసూచకమని అన్నారు. అదేవిధంగా వక్రీకరించ బడిన చరిత్రను తిరిగి సవరించుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యిందని అన్నారు. అలెగ్జాండర్, నేపోలీయన్ లాంటి వారిని పక్కనబెట్టి శివాజీ, రాణాప్రతాప్, సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్, గద్వాల మహారాణి, కర్నూలు మహరాజు లాంటి వారి నిజమైన విజయగాధలను బావితరాలు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విజయదశమి లాంటి ఉత్సవాలు అందుకు దోహదపడుతాయని అన్నారు. ఈ క్రమంలో పుర ప్రముఖులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.