సుమిత్ర నగర్ లో పలహారం బండి ఊరేగింపు లో పాల్గొన్న గాంధీ

శేరిలింగంపల్లి, ఆగస్టు 17 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలని పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని సుమిత్రనగర్ కాలనీలో నిర్వహించిన ఫలహారం బండి, తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయులు, మహిళల‌కు బోనాల పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి కృప, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు.

తెలంగాణ ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బోనాల మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం సంతోషకరమని గాంధీ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఏడాది బోనాల ఉత్సవాల కోసం రూ.20 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 92 దేవాలయాలకు మొత్తం రూ.30.71 ల‌క్ష‌ల నిధులు మంజూరైనట్లు గాంధీ వెల్లడించారు. బోనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో బోనాల ఉత్సవాలను నిర్వహించుకునేలా అవసరమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here