శేరిలింగంపల్లి, జనవరి 20 (నమస్తే శేరిలింగంపల్లి): సింగరేణి బొగ్గు గనుల కాంట్రాక్ట్ కుంభకోణం బయటపెట్టినందుకే హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది అని శేరిలింగంపల్లి యువ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ చిర్రా రవీందర్ యాదవ్ అన్నారు. రెండేళ్ల నుంచి మంత్రులు అనేక కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కుంభకోణాలను ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంటామని వెల్లడించారు. బీ ఆర్ ఎస్ పార్టీ శాసన సభ వేదికగా, ప్రజా క్షేత్రంలో బయట పెడుతుంటే కేసులు పెడుతున్నారని చెప్పారు. ఒకసారి కాళేశ్వరం కేసు అని, ఇంకో సారి ఈ కార్ రేస్ అని , మరోసారి విద్యుత్ కేసు అని విచారణ పేరుతో పిలుస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వ హామీలను నిలదీస్తూనే ఉంటామని చిర్రా రవీందర్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రజల కోసం మాట్లాడుతున్న హరీష్ రావు పై కేసులు పెడుతున్నారుని, అవినీతికి పాల్పడుతున్న రేవంత్ రెడ్డి పైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు.






