నమస్తే శేరిలింగంపల్లి:హైదరాబాద్ నగరంలోని రోగుల అవసరాలను ఆదాయ వనరుగా మార్చుకుని అంబులెన్స్ లపై కమిషన్లు తీసుకుంటూ కమిషన్ అంబులెన్స్ సర్వీసు పేరుతో అక్రమంగా నడుస్తున్న రెడ్ అంబులెన్స్ సంస్థను నిషేధించాలని బీఎంఎస్, బీపీటీఎంఎం నాయకులు డిమాండ్ చేశారు. బీఎంఎస్ అనుబంధ గ్రేటర్ హైదరాబాద్ అంబులెన్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కొండాపూర్ లోని రెడ్ అంబులెన్స్ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ లోని ప్రతి హాస్పిటల్ వద్ద రెడ్ అంబులెన్స్ పేరున ఒక సంస్థ రోగులను నిలువెత్తు దోపిడీ చేస్తూ, స్థానిక అంబులెన్స్ ఓనర్ల, డ్రైవర్ల ఉపాధి దెబ్బతీస్తున్నదని వాపోయారు. ఎన్నో ఏళ్లుగా నగరంలో అంబులెన్స్ లు నడుపుతూ జీవనం సాగిస్తున్న సుమారు 1500 మంది అంబులెన్స్ యజమానుల పొట్ట కొడుతూ కార్పొరేట్ హంగులతో ఏర్పడి కమిషన్లతో అంబులెన్స్ యజమానుల నడ్డి విరుస్తూ నగరంలో కొనసాగుతున్న రెడ్ అంబులెన్స్ సర్వీస్ ను నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో బీఎంఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. శ్రీనాథ్, ఉపాధ్యక్షులు నాగన్న, రవిశంకర్, శ్రీనివాస్, రమేష్, బలరాం, శంకర్, బీపీటీఎంఎం నాయకులు మైసయ్య యాదవ్, సమ్మయ్య, గ్రేటర్ హైదరాబాద్ ప్రైవేట్ అంబులెన్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.