శేరిలింగంపల్లి, డిసెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తుందని భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ అన్నారు. కుట్రలకు పాల్పడటమే కాకుండా ప్రజాభిప్రాయన్ని పట్టించుకోవడం లేదన్నారు. సచివాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను తాము తిరస్కరిస్తున్నామని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం రూపు మార్చడం దారుణమని మండిపడ్డారు. బతుకమ్మ తెలంగాణ ప్రత్యేక పండుగ అని, అలాంటి బతుకమ్మను తొలగించి హస్తం పార్టీ గుర్తును పెట్టడంపై నిలదీశారు. ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం, పంచామృతాభిషేకంను నిర్వహించారు. ఈ సందర్భంగా భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ మాట్లాడుతూ… ఉద్యమ తల్లే తమ తల్లి అని, హస్తం గుర్తు తల్లిని ఆమోదించేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ మహిళలు ఎప్పటికీ పేదలుగానే ఉండాలా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ చరిత్రను, కేసీఆర్ పాలన ఆనవాళ్లు లేకుండా చేయాలనే కుటిల ప్రయత్నాలు సాగవన్నారు. బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి తొలగించారని, ఇది మంచి పద్ధతి కాదని వెల్లడించారు. ప్రజల తరుపున భారాస పోరాడుతుందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అధికారంలోకి వస్తామని రవీందర్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.