నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తామని స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ రైలు విహార్ కాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించి సమస్యలను పరిశీలించారు. రోడ్లకు ఇరువైపుల ఉన్న చెత్తను, మట్టి దిబ్బలను శానిటేషన్ సిబ్బందితో తొలగింపజేశారు. ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం, పరిశుభ్రత, వైకుంఠ ధామాలు, డంప్ యార్డుల నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పించే ఉద్దేశ్యంతో తెలంగాణ సర్కారు పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టిందన్నారు. స్థానిక ప్రజలందరి సహకారంతో డివిజన్ అభివృద్ధి చేస్తామని, ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ యాదవ్, రవి యాదవ్, గోపాల్ యాదవ్, బసవరాజు లింగాయత్, గఫ్ఫార్, కాలనీ వాసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.