నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ ఏమినేషియా పబ్ లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార కేసులో నిజ నిజాలు వెలికితీసేందుకు సీబీఐ దర్యాప్తు జరిపించాలని బిజెవైఎం రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జితేందర్ డిమాండ్ చేశారు. మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్య రాష్ట్రంలో చట్టం అందరికి సమానమే అయినప్పుడు పోలీసులు పేద వారికి ఒక న్యాయం, ప్రజాప్రతినిధుల కుమారులకు ఒక న్యాయం అన్నట్లు వ్యవహరించడం సరికాదన్నారు. నిందితులు ఎవరైనా వారిని కఠినంగా శిక్షించాలి, బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించాలని అన్నారు. మైనర్లను అనుమతించిన పబ్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలి పక్షాన పోరాటం చేస్తున్న బిజెవైఎం నాయకులను, కార్యకర్తలను అక్రమంగా ముందస్తు అరెస్టులు, గృహ నిర్భదాలను చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు జితేందర్ పేర్కొన్నారు.