చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె లో భాగంగా చందానగర్ గాంధీ విగ్రహం దగ్గర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఎం పార్టీ నాయకులు సి. శోభన్, వి.మాణిక్యం, ఎంసీపీయూ నాయకుడు ఎం.అనిల్ కుమార్ లు మాట్లాడుతూ కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతుందని విమర్శించారు. రైతులకు, కార్మికులకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో చట్టాలు తీసుకొని వచ్చారని విమర్శించారు. భారత మాతా కి జై అంటూ భారతీయ ఆస్తులు బీఎస్ఎన్ఎల్, రైల్వే, ఎల్ఐసీ లాంటి పెద్ద పెద్ద సంస్థ లను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టుతున్నారని విమర్శించారు. వ్యవసాయ బిల్లు ద్వారా రైతులకు తీవ్ర నష్టం చేశారని అన్నారు. కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం ఆపివేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ కార్యదర్శి కె కృష్ణ, ఏఐటీయూసీ నాయకులు రామకృష్ణ, చందు యాదవ్, నారాయణ, ప్రదీప్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు అభిషేక్ నందన్, బషీర్, శిరీష పాల్గొన్నారు.