శేరిలింగంపల్లి జోన్‌లో ప్రజావాణి.. 23 వినతుల స్వీకరణ..

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 23 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ సర్కిళ్ల పరిధి నుంచి వచ్చిన ప్రజల వినతులను జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ స్వీకరించారు. పురపాలక సేవలకు సంబంధించిన పలు సమస్యలపై ప్రజలు తమ ఫిర్యాదులను అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించిన జోనల్ కమిషనర్, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల వివరాలను తెలుసుకున్నారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 23 వినతులు అందాయి. వీటిలో శేరిలింగంపల్లి సర్కిల్ నుంచి 9, మియాపూర్ సర్కిల్ నుంచి 5, అమీన్‌పూర్ సర్కిల్ నుంచి 3, నార్సింగి సర్కిల్ నుంచి 2, పటాన్‌చెరు సర్కిల్ నుంచి 1, జోనల్ కార్యాలయంలో 3 వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలను సమర్థవంతంగా, వేగంగా పరిష్కరించడం ద్వారా ప్రజాభిముఖ, పారదర్శక పాలన అందించడమే తమ లక్ష్యమని జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుకు ప్రాధాన్యతనిస్తూ, సమస్యల పరిష్కారానికి అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here