లహరి హోమ్స్ వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం: గాంధీ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీద్‌బండ లహరి హోమ్స్ కాలనీలో నెలకొన్న వరద నీటి కాలువ‌ ఔట్‌లెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు చేపడుతున్నట్లు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ తెలిపారు. CMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి ఆయన కాలనీలో సమస్యను పరిశీలించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. వరద నీటి కాలువ‌ ఔట్‌లెట్ సక్రమంగా లేకపోవడంతో వర్షాల సమయంలో నీరు నిలిచిపోయి కాలనీ ముంపునకు గురవుతోందని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పనులను త్వరితగతిన చేపట్టి అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు.

ముంపు సమస్య మళ్లీ పునరావృతం కాకుండా పక్కా ప్రణాళికతో వరద నీటి కాలువ‌ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కాలనీ వాసులకు ప్రశాంతమైన వాతావరణం కల్పించడంతో పాటు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని, వరద నీటి కాలువ‌ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని అధికారులకు సూచించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడరాదని స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని గాంధీ తెలిపారు. నియోజకవర్గంలో అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచి శేరిలింగంపల్లి డివిజన్‌తో పాటు నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో CMC అధికారులు DE ఆనంద్, AE రషీద్, మాజీ కౌన్సిలర్ రామస్వామి యాదవ్, నాయకులు మారబోయిన రాజు యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మల్లేష్ యాదవ్, మల్లేష్ గౌడ్, కొడిచెర్ల రాములు, పవన్‌తోపాటు లహరి హోమ్స్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here