సీజ్ చేసిన భవనంలో పనులు కొనసాగుతున్నాయి.. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి: జనం కోసం

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దీప్తిశ్రీనగర్‌లోని సర్వే నంబర్‌ 151, రేగులకుంట పరిధిలోని ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపడుతున్నారని, అధికారులు సీజ్ చేసిన భవనంలోనూ పనులు కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ జనం కోసం సంస్థ తహసీల్దార్‌ కం డిప్యూటీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ భూమిని కాపాడడంతోపాటు సంబంధిత బిల్డర్లు, సొసైటీ నిర్వాహకులు, ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి డిమాండ్ చేశారు.

సర్వే నంబర్‌ 151లోని భూమి ప్రభుత్వ సర్కారీ భూమిగా అధికారులు నిర్వహించిన సర్వేలో తేలిందని ఆయన పేర్కొన్నారు. అయితే బిల్డర్లు పవన్‌కుమార్‌, శ్రీనివాసరావులు అధికారుల సర్వేపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏ.డీ.కి దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై జనం కోసం కలెక్టర్‌, ఏ.డీ.లకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తమ ఫిర్యాదుపై ఏ.డీ. కార్యాలయం నుంచి సర్వేకు సంబంధించిన అంశాలపై తహసీల్దార్‌ కార్యాలయానికి లేఖ వచ్చినప్పటికీ, తదుపరి చర్యల్లో జాప్యం జరిగిందని భాస్కరరెడ్డి ఆరోపించారు. సీజ్ చేసిన భవనంలో పనులు కొనసాగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదని విమర్శించారు. తాజాగా ఈ విషయంపై ప్రశ్నించగా హైడ్రాకు లేఖ రాస్తామని అధికారులు చెప్పడం ద్వారా తమ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని జనం కోసం ఆరోపించింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న వారిపై తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.

సర్వే నంబర్‌ 151లోని 372 గజాల ప్రభుత్వ భూమితో పాటు చుట్టుపక్కల ఉన్న సుమారు 5,000 గజాల ప్రభుత్వ భూమిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది. సీజ్ చేసిన భవనంలో పనులు పూర్తిగా నిలిపివేయడంతో పాటు, అవసరమైతే భవనాన్ని కూల్చివేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని భాస్కరరెడ్డి విజ్ఞప్తి చేశారు. భవనం వద్ద నిర్మాణ పనులు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, సంబంధిత వ్యక్తులపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here