శేరిలింగంపల్లి, నవంబర్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు నిధుల మంజూరు కోసం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి జోనల్ కమిషనర్ హేమంత్ భోర్కడేని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం జోనల్ కమిషనర్ హేమంత్ భోర్కడేతో సమావేశమై గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం, ఖజాగుడ కుమ్మరి బస్తీ, నానక్ రామ్ గూడ, కేశవ నగర్, నేతాజీ నగర్, నల్లగండ్ల హుడా కాలనీలలో సీసీ రోడ్లు దెబ్బ తినడం వల్ల చిన్న పాటి వర్షానికి గుంతలలో నీరు నిలిచి స్థానిక ప్రజలు రాకపోకలకు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, తక్షణమే నూతన రోడ్లు వేయించాలని కోరారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని జనాభా దృష్ట్యా రోడ్డు వెడల్పు కూడా చేయవలసిన అవసరం ఉందని కార్పొరేటర్ జోనల్ కమిషనర్ ని కోరారు. గచ్చిబౌలి డివిజన్ విస్తారమైన ప్రాంతం కాబట్టి ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు నివసిస్తారని, స్థానికుల మౌలిక వసతుల కోసం తగిన నిధులు మంజూరు చేయవలసిందిగా కార్పొరేటర్ జోనల్ కమిషనర్ ని కోరారు. దీనికి జోనల్ కమిషనర్ హేమంత్ భోర్కడే సానుకూలంగా స్పందించి ప్రస్తావించిన పనులపై తక్షణమే అంచనా వేసి తగిన నిధుల మంజూరు కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ మాజీ ఉపాధ్యక్షుడు తిరుపతి, సీనియర్ నాయకులు రాజు, శ్రీను, గోవిందా తదితరులు పాల్గొన్నారు.






