శేరిలింగంపల్లి, డిసెంబర్ 31 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ అభివృధి కోసం హెచ్ఎండబ్ల్యూఎస్, ఎస్ బి ఆధ్వర్యంలో రూ.7.96 కోట్ల అంచనా వ్యయంతో డివిజన్ పరిధిలో పలు కాలనీలలో భూగర్భ డ్రైనేజీ పనులకు నిధులు మంజూరు చేసినందుకు మియాపూర్ డివిజన్ ప్రజల తరపున మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ హైదర్ నగర్ జలమండలి కార్యాలయంలో డివిజన్ పరిధిలో మంజూరైన నిధులు, చేపట్టవలసిన భూగర్భ డ్రైనేజీ అభివృధి పనులపై జలమండలి CGM నారాయణ, GM శ్రీనివాస్ రెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందని, అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని అన్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా పనిచేయాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, ప్రజా సమస్యల పై అధికారులు నిర్లిప్తతను వీడాలని, తమ దృష్టికి ప్రజల నుండి వచ్చిన ప్రజా సమస్యల పై స్పందించే అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి మియాపూర్ మేనేజర్ సునీత తదితరులు పాల్గొన్నారు.






