నమస్తే శేరిలింగంపల్లి: మదర్ థెరిసా సేవలు మరవలేనివని, సామాజిక సేవ కోసం, అనాథ పిల్లల కోసం తన ఉపాధ్యాయ వృత్తిని వదిలేసిన మహోన్నతురాలు అని ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ జె. బాలమణి అన్నారు. ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మదర్ థెరిసా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మదర్ థెరిసా చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. జె. బాలమణి మాట్లాడుతూ ప్రార్ధించే పెదవులకన్న సాయం చేసే చేతులు మిన్న అని అన్నారు. మదర్ థెరిసా మానవ సేవకు శ్రీకారం చుట్టారన్నారు. అనాధ పిల్లల కోసం పాఠశాలలను ఏర్పాటు చేసి ఆమె సేవా నిరతిని చాటారన్నారు. ఎందరో అభాగ్యులు, పేదలకు, రోగులకు సేవలు అందించారన్నారు. మదర్ థెరీసా సేవలను గుర్తించి 1979లో నోబుల్ శాంతి బహుమతికి భారత ప్రభుత్వం ఎంపిక చేసి భారతరత్న బిరుదుతో సత్కరించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జె. గోపాల్ గౌడ్, గోనెల రాధాకృష్ణ, గంగాధర్ సురేష్, సరిత, భూమిక, నందిని, ఫారీదా తదితరులు పాల్గొన్నారు.