నమస్తే శేరిలింగంపల్లి: బీహెచ్ఈఎల్ ఓల్డ్ ఎంఐజీ బి పార్కు సొసైటీ కార్యాలయంలో స్మార్ట్ విజన్ కంటి ఆస్పత్రి సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఎత్తు, బరువు, బీపీ, షుగర్, బీఎంఐ, కంటి, దంత పరీక్షలను వంద మందికి నిర్వహించారు. భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సిందు ఆదర్శ్ రెడ్డి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారిన జీవన శైలి విధానంలో పర్యావరణంలో వచ్చిన మార్పుల వల్ల అనేక వ్యాధులకు గురవుతున్నారని అన్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఆశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి వారి సూచనలు, సలహాలను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. మానవుడు ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం, నడక, మెడిటేషన్ చేయాలని పేర్కొన్నారు. సాధ్యమైనంత మేరకు తాజా ఆకు కూరలు, పీచు పదార్థాలు కలిగిన ఆహారం, తాజా పండ్లు, పాలు, పాల ఉత్పత్తులు, గ్రుడ్లు, చేపలు, వైట్ మటన్ లాంటి పోషకాహారాన్ని తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు డి. రాజు, కె. రాములు, రాణి యాదవ్, సంధ్య, వినోద, రాధా, రజని, ఫాతిమా, పరమేశ్ యాదవ్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కే.ఎల్ మూర్తి, రాధా కృష్ణ మూర్తి, ఆస్పత్రి ప్రతినిధి తిలక్ తదితరులు పాల్గొన్నారు.