నమస్తే శేరిలింగంపల్లి: ఒక కేజీ బరువుగల అరుదైన థైరాయిడ్ గ్రంధిని తొలగించి రోగి ప్రాణాలను కాపాడారు మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు. గుంటురు ప్రాంతానికి చెందిన ఒక రోగి(54 ఏళ్ల మహిళ)కి శ్వాస తీసుకునేప్పుడు, దగ్గుతున్నప్పుడు, అదేవిధంగా భోజనం చేసేప్పుడు గొంతు దగ్గర తీవ్ర ఇబ్బంది కలుగుతుండటంతో మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్ వైద్యులను ఆశ్రయించారు. దీంతో ఆమెకు వైద్య పరీక్షలు జరిపిన వైద్యులు ఆమె మెడ కింది భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో 1 కేజీ బరువు గల గ్రంధిని గుర్తించారు. ఐతే ఆమెకు గతంలోనే వేరే దవాఖానాలో థైరాయిడ్ ఆపరేషన్ చేశారు. అది విఫలమవ్వడంతో మెడికవర్ వైద్యుల బృందం జనరల్ సర్జన్ డాక్టర్ పవన్‌కుమార్, చీఫ్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రమోద్ రెడ్డీల రెడో సర్జరీ నిర్వహించారు. కీహోల్ విధానం ద్వారా సర్జరీ చేసి గ్రంధిని తొలగించారు. వారికి అనస్తీషియా డాక్టర్ విజయ్ చల్ల, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రఘుకాంత్‌లు పూర్తి సహకారం అందించారు. ఈ సందర్భంగా డాక్టర్స్ మాట్లాడుతూ ఇటువంటి థైరాయిడ్ ని రెట్రోస్టెర్నల్ గోయిట్రే అని అంటారన్నారు. సాధారణంగా ఇటువంటి అరుదైన థైరాయిడెక్టమీ రోగులు 5 % మంది ఉన్నారని తెలిపారు. థైరాయిడ్ ఛాతీలోకి క్రిందికి విస్తరించినప్పుడు రెట్రోస్టెర్నల్ గోయిట్రే సంభవిస్తుందని, సరైన సమయంలో తెలుసుకోవడం వలన రోగి ప్రాణాలను కాపాడ గలిగామని అన్నారు. ఆలస్యం చేస్తే ఈ గ్రంధిలో కాన్సర్ రావడానికి కారణం కూడా కావచ్చని అన్నారు. ఓపెన్ సర్జరీతో పోలిస్తే ఇటువంటి తక్కువ శస్త్రచికిత్సా విధానాలు వల్ల రోగి వేగంగా కోలుకోవడం, నొప్పి తగ్గడం, తక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండటం వంటి అవకాశాలు ఉంటాయని తెలిపారు.