నమస్తే శేరిలింగంపల్లి: భారత మార్కిస్టు కమ్యూనిస్ట్ పార్టీ (ఎంసీపీఐ(యు)) కేంద్ర కమిటీ సమావేశాలు ఈ నెల 23, 24, 25 తేదీలలో మూడు రోజుల పాటు హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఓంకార్ భవన్ లో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎంసీపీఐ(యు) కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు తాండ్ర కుమార్ తెలిపారు. ఓంకార్ భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజా సమస్యలపై చర్చించి ప్రజాపోరాటం చేయాలనే లక్ష్యంతో ఈ మూడు రోజుల పాటు నిర్వహించే సమావేశాల్లో చర్చించనున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం వ్యక్తి సమాచార స్వేచ్ఛను హరిస్తూ సోషల్ మీడియాను హైజాక్ చేస్తూ రాజ్యాంగ విలువలను దిగజారుస్తుందని ఎద్దేవా చేశారు. కోట్లాది మంది ఆర్థిక వ్యవస్థ తో ముడిపడి ఉన్న సహకార వ్యవస్థ ను బిజెపి ప్రభుత్వం విధ్వంసం చేస్తూ ప్రభుత్వ రంగాన్ని దెబ్బకొడుతుందన్నారు. ఈ సమావేశం లో ఎంసీపీఐ(యు) రాష్ట్ర సహాయ కార్యదర్శి గాదగోని రవి, కార్యవర్గ సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.