నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి మోడీ ప్రభుత్వ మతోన్మాద విధానాలతో దేశంలో ఆకలి చావులు, ఆత్మహత్యలు, నిరుద్యోగం, నేరాలు, నిర్బంధం పెరిగి ప్రజాస్వామ్యానికి ప్రమాదం వాటిల్లుతోందని ఎంసీపీఐయూ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్దికాయల అశోక్ ఓంకార్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభల్లో ప్రధాన వక్తగా ఎంసీపీఐయూ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్దికాయల అశోక్ ఓంకార్ పాల్గొని మాట్లాడారు. దేశ ప్రజాస్వామ్య రక్షణ కోసం, దోపిడీ పాలకుల విముక్తి కోసం ఐక్యంగా ఉద్యమించకపోతే మరో హిట్లర్ పాలనకు వంత పాడిన వాళ్లవుతామని అన్నారు. వామపక్ష సామాజిక శక్తుల ఐక్యత కేంద్రంగా ప్రజా ఉద్యమాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. స్వదేశీ నినాదంతో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ఆచరణలో విదేశీ సామ్రాజ్యవాద విధానాలను అనుసరిస్తూ ప్రజలకు సేవ చేసే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టి ఊడిగం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజాసంక్షేమం మరచి పేద మధ్యతరగతి ప్రజలపై ఎనలేని భారాలు మోపుతూ అధికారాన్ని కాపాడుకునేందుకు కుల మత ప్రాంత లింగ విభేదాలు సృష్టిస్తున్నారన్నారు. బూర్జువా భూస్వామ్య పార్టీల విధానాలు పేరుకే సంక్షేమాలు, హామీలు తప్పా ఆచరణలో అన్ని దోపిడీ విధానాలేనని దేశ రక్షణకు ప్రజాస్వామ్య పరిరక్షణకు వామపక్ష సామాజిక శక్తుల ఐక్య ఉద్యమాలే శరణ్యమని శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సీపీఎం, సీపీఐ పార్టీలు పార్టీలతో కాకుండా కమ్యూనిస్టు పార్టీలు సామాజిక శక్తుల ఐక్యత కోసం జరిగే కృషిలో భాగస్వాములు కావాలని, లేకపోతే వారిని బూర్జువా పార్టీల భాగస్వామిగా చూస్తారని అన్నారు.
స్వరాష్ట్రం సాధించుకున్న ఆశించిన అభివృద్ధి జరగక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజా ఉద్యమాల వారధిగా, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా వామపక్ష సామాజిక శక్తుల ఐక్యత ధ్యేయంగా పనిచేస్తున్న ఎంసీపీఐ(యూ) ను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కాటం నాగభూషణం, వల్లెపు ఉపేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గాదగోని రవి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సింగతి సాంబయ్య, కుంభం సుకన్య, వరికుప్పల వెంకన్న, వస్కుల మట్టయ్య, పెద్దారపు రమేష్, గోనె కుమారస్వామి, ఎన్ రెడ్డి, హంసారెడ్డి, తుకారాం నాయక్, యం రమేష్, మురళి రాష్ట్ర కమిటీ సభ్యులు, ఇ దశరథ్ నాయక్, కర్ర దానయ్య తాండ్ర కళావతి, వివిధ జిల్లాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.