శేరిలింగంపల్లి, నవంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా జరుగుతున్న రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులలో భాగంగా తెలంగాణ, హైదరాబాద్ లో అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి కోసం సికింద్రాబాద్ టెర్మినల్ లో రూ.700 కోట్లతో అభివృధి పనులు కొనసాగుతున్నాయని, రూ.300 కోట్లతో నాంపల్లి టెర్మినల్ అభివృధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. కాచిగూడ టెర్మినల్ అభివృద్ది పనులు త్వరలో ప్రారంభమవుతాయని, చర్లపల్లి టెర్మినల్ పనులు కూడా శరవేగంగా జరుగుతుండటం ప్రధాని మోదీ దార్శనికతకు నిదర్శనమని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు.

చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలతో 45 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు పూర్తి చేసి ఏకకాలంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారన్నారు. శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ అత్యాధునిక సౌకర్యాలతో, హైటెక్ సిటీ, హఫీజ్ పేట్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతుండటం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. వీటితో పాటు లింగంపల్లి రైల్వే స్టేషన్ ను కూడా అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కూకట్ పల్లి బీజేపీ నాయకుడు కాంతారావు, జిల్లా ఉపాధ్యక్షుడు రాధాకృష్ణ యాదవ్, కోశాధికారి కృష్ణం రాజు, లింగంపల్లి డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేష్, చందానగర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ సింధు రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, వంశీ రెడ్డి, సీనియర్ నాయకులు గోపాల్ రావు, మల్లేష్ , ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





