- ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్‌లతో కొండాపూర్ దవాఖానా సందర్శన
- కోవిడ్‌పై వివిధ విభాగాల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష
- జిల్లా దవాఖానా ప్రత్యేక అధికారిగా తహసీల్దార్ వంశీమోహన్ నియామకం
నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్‌లోని జిల్లా దవాఖానాను తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ, జిల్లా ఇంచార్జీ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి మంగళవారం సందర్శించారు. ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, ఇతర అధికారులతో కలిసి ఆస్పత్రిలో అన్ని వార్డులను మంత్రి పరిశీలించారు. అనంతరం కోవిడ్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిరంతర పర్యవేక్షణతో కోవిడ్‌పై ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూన్నారని అన్నారు. ఆయన ఆదేశాల మేరకే కొండాపూర్ హాస్పిటల్‌లో 100 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా వనస్థలిపురంలో 50 బెడ్లు, షాద్ నగర్‌లో 50 బెడ్లు, జల్‌పల్లిలో 40 బెడ్లతో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆస్పత్రుల్లో కోవిడ్ పేషంట్లకు అందుతున్న వైద్యం, ఇతర సదుపాయాలపై ఎప్పటికప్పుడు ఆరాతీస్తున్నామని, ప్రయివేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చి దిద్దుతున్నామని అన్నారు. జిల్లా ఆస్పత్రితో పాటు ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల మందులు,ఆక్సిజన్ అందుబాటులో ఉంచామన్నారు. వైద్యులు,సిబ్బంది అందుబాటులో ఉండి సమన్వయంతో రోగులకు సేవ చేయాలని సూచించారు. తెలంగాణ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన ఫీవర్ సర్వే నేడు దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే ఒక సారి పూర్తి అయిన జ్వర సర్వేలో కోవిడ్ లక్షణాలు ఉన్న వారికి అవసరమైన మందులు, కిట్ లు అందించటం జరిగిందని అన్నారు. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించి, కనీస జాగ్రత్తలతో కరోనా రహిత సమాజం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. వాక్సినేషన్ ఇబ్బందులు దూరం చేయటానికి, అందరికి వాక్సిన్ వేయటానికి గ్లోబల్ టెండర్లు పిలవడం జరుగుతుందని. ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే, గాంధీ ఎప్పటికప్పుడు జిల్లా ఆస్పత్రిపై ప్రత్యేక నిఘా పెట్టి బాగా పనిచేస్తున్నారని మంత్రి ప్రశంసించారు. కొండాపూర్ ఏరియా హాస్పిటల్ ప్రత్యేక అధికారిగా శేరిలింగంపల్లి తహశీల్దార్ వంశీమోహన్‌ను నియమిస్తున్నట్టు మంత్రి తెలిపారు.

ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కొండాపూర్ జిల్లా ఆస్పత్రిలో అన్ని రకాల మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో, జిల్లా మంత్రి సబితా రెడ్డి సహకారం తో కోవిడ్ పై పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆస్పత్రిలో మెరుగైన వసతుల కోసం సమీక్షించటం జరిగిందని, రోగులతో మాట్లాడి ఏ మేరకు వైద్యం అందుతుందో తెలుసుకున్నామని అన్నారు. కల్వరి టెంపుల్‌లో 300 బెడ్లు, న్యాక్‌లో 200 బెడ్లతో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశామని అన్నారు. నిత్యం ప్రజలు పెద్ద ఎత్తున వస్తునందున అదనపు సిబ్బంది కోసం కృషి చేస్తున్నట్టు తెలిపారు. కేంద్రం వాక్సిన్ కొనుకోమని చెప్తుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచితంగా ఇస్తామని ప్రకటించటం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రతిక్, డీసీపీ వెంకటేశ్వర్లు, వైద్యాధికారులు స్వరాజ్యాలక్ష్మి, ఝాన్సీ, జోనల్ కమిషనర్ రవి కిరణ్, ఆర్ఎంఓ రామకృష్ణ, ఆస్పత్రి సుపేరిడెంట్ దశరథ్ తదితరులు పాల్గొన్నారు.
