- మరణించినా జీవించండి అనే నినాదంతో అందరికీ స్ఫూర్తినిచ్చిన కమలమ్మ
శేరిలింగంపల్లి, నవంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): సీపీఎం నాయకురాలు కొండకింది కమలమ్మ (90) పార్థివ దేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు మమతా మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు అందజేశారు. మై హోం జువెల్ గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో తన చిన్న కుమార్తె సుగుణ ఇంట్లో నివాసం ఉంటున్న ఆమె గత కొంత కాలంగా వయో భార అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ నెల 19వ తేదీన కన్నుమూశారు. దీంతో కమలమ్మ పార్థివ దేహాన్ని హాస్పిటల్‌కు దానం చేసేందుకు సుగుణ ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే గురువారం ఆమె పార్థివ దేహాన్ని హాస్పిటల్‌కు అందజేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మై హోమ్ జెవెల్ గేటెడ్ కమ్యూనిటీ క్లబ్ హౌస్ లో మరణించినా జీవించండి అనే నినాదంతో అఖిల భారత శరీర, అవయవ దాతల సంఘం తరఫున గూడూరు సీతా మహాలక్ష్మి ఆధ్వర్యంలో మై హోమ్ జువెల్ కమ్యూనిటీ బోర్డు సహకారంతో ఓ వినూత్నమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రేరణ పొందిన కమలమ్మ మరణానంతరం తన దేహాన్ని దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఆమె భౌతిక కాయాన్ని ఆమె కుటుంబ సభ్యులు మమతా మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు అప్పగించారు.

కాగా కమలమ్మ నల్లగొండ జిల్లా ప్రస్తుత భువనగిరి- యాదాద్రి జిల్లా రామన్నపేట మండలంలోని నీర్నాముల గ్రామంలో జన్మించారు. పెరిగి పెద్దయిన తర్వాత ప్రక్కనే ఉన్న శోభనాద్రిపురం వాసి కొండకింది శ్రీనివాస రెడ్డితో ఆమెకు వివాహం జరిగింది. శ్రీనివాస రెడ్డి 1940-48 ల నాటి సమైక్య కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా అప్పటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. వారి వివాహం అయిన తర్వాత కమలమ్మ కూడా ఆ పోరాటానికి మద్దతు ఇచ్చి భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ పరోక్షంగా సహాయం చేసేవారు. దాంపత్య జీవితంతోపాటు ఉద్యమ కార్యకర్తగా పోరాటానికి సహాయ సహకారాలు అంద జేసేవారు. శ్రీనివాస రెడ్డి కొన్నాళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నా కూడా కమలమ్మ ఓ వైపు వ్యవసాయం చేస్తూనే మరోవైపు పార్టీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుని పార్టీకి సహకారం అందజేసేవారు.

కాగా ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కొడుకులు జన్మించారు. పార్టీ చీలిక తర్వాత వీరు సీపీఎంలో చేరి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. వీరి సంతానం కూడా వామపక్ష సిద్ధాంతాలు పాటిస్తూ పెరగడం విశేషం. శ్రీనివాస రెడ్డి ఆకస్మిక మరణంతో కమలమ్మ దిగులు పడకుండా తన కుటుంబాన్ని సమర్థవంతంగా పోషించారు. ఈ దంపతులు తెలంగాణ పోరాటంలో చేసిన కృషికి, చూపించిన తెగువకు గాను కమలమ్మకు సీపీఎం నాయకులు ఫ్రీడం ఫైటర్ పెన్షన్ వచ్చేలా చేశారు. కాగా ఆమె మృతి పట్ల నాయకులు సంతాపం తెలిపారు.





