నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన రూ.1.37 కోట్ల ఆర్ధిక సహాయాన్ని మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలసి ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో 137 మంది లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురికి కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం కింద చెక్కులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి లబ్ధిదారులకు పంపిణీ చేయడం ఎంతో సంతృప్తిని కలిగించిందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిందని, వాటి అమలుకు ఏ లోటూ రాకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందంటే సీఎం కేసీఆర్ పనితీరు అందుకు నిదర్శనం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నాయబ్ తహసీల్దార్ శంకర్, జూనియర్ అసిస్టెంట్లు సాయికిరణ్, హంజద్, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.