శేరిలింగంపల్లి, ఆగస్టు 17 (నమస్తే శేరిలింగంపల్లి): కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రాష్ట్ర సాధకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేదింటి ఆడబిడ్డల వివాహాల కోసం ఎంతో ఆలోచనతో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. పేద కుటుంబాల్లో ఆడపిల్ల వివాహం గురించి ఉండే ఆర్థిక ఆందోళనను తగ్గించేందుకు ప్రభుత్వం తరఫున రూ.1,00,116 ఆర్థిక సాయం అందించారని చెప్పారు.

ఈ పథకం అమలులోకి వచ్చిన తర్వాత బాల్య వివాహాలు తగ్గడంతోపాటు ఆడపిల్లలు 18 ఏళ్ల వరకు చదువుకునే పరిస్థితి ఏర్పడిందని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కల్యాణలక్ష్మి పథకానికి రూ.1,00,116తో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి ప్రజల నుంచి ఓట్లు పొందిందని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా పథకాన్నే నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు. పథకం అమలుపై హైకోర్టులో స్టే రావడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం న్యాయస్థానంలో కౌంటర్ దాఖలు చేసి స్టే తొలగిపోయేలా చర్యలు తీసుకోవాలని, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు వెంటనే అందజేయాలని కోరారు. అలాగే ఆసరా పెన్షన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని కోరుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, దళిత నేత బాబు జగ్జీవన్ రామ్‌లకు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, బీఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ శ్రీనివాస్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.





