నమస్తే శేరిలింగంపల్లి: స్మశాన వాటిక కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని కొన్నేళ్లుగా కొందరు ఆక్రమణదారులు కబ్జా చేశారు. కబ్జా చేయడమే కాదు గేదెల పాక వేసి పాగా వేశారు. ఎట్టకేలకు స్పందించిన రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారంతో కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు.
చందానగర్ డివిజన్ పరిధిలోని సర్వే నంబర్ 27 లో గల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమణదారులు గత కొంతకాలం క్రితం కబ్జా చేశారు. గేదెల పాక కోసం షెడ్ వేసుకొని స్మశాన వాటికకు కేటాయించిన స్థలంలో చుట్టూ ప్రహరీ గోడను నిర్మించుకున్నారు. కాగా గతంలో చాలామంది సదరు ఆక్రమణపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి సైతం ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు కేటాయించాలని చాలా ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు డిప్యూటీ కలెక్టర్ శేరిలింగంపల్లి తహసిల్దార్ వంశీమోహన్ ఆదేశాలతో గిరిదావర్ సీనయ్య బృందం రంగంలోకి దిగింది. పోలీసుల సహకారంతో ప్రహరీ గోడను, గేదెల షెడ్ ను, కూల్చివేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. జాప్యం జరిగినా చివరకు ప్రభుత్వ స్థలాన్ని కాపాడినందుకు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ రెవెన్యూ యంత్రాంగంకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.