నమస్తే శేరిలింగంపల్లి: స్వాతంత్ర్య సమరయోధుడు, దళిత బహుజన వర్గాలను జాతీయ స్థాయిలో ఐక్యం చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రావు అని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గచ్చిబౌలి ఓల్డ్ విలేజ్ లో బిజెవైఎం చేవెళ్ల పార్లమెంట్ కో కన్వీనర్ తోట్ల భరత్ కుమార్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి నిర్వహించారు. బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ 1930లో సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ పోలీసులను ఎదురించి లాఠీ దెబ్బలకు బెదరకుండా నిలబడ్డ స్వాతంత్య్ర సమరయోధుడు అని అన్నారు. సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాటం సాగించిన రాజకీయ, సామాజిక విప్లవ వీరుడు అని కొనియాడారు. కేవలం 27 ఏళ్ల వయస్సులోనే శాసన మండలి సభ్యునిగా ఎన్నిక కావడం, 52 ఏళ్లు పార్లమెంటును ఏలిన మహా అనుభవ శీలి అని, వ్యవసాయ, రక్షణ, ఆరోగ్య, రైల్వేశాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన అందించిన సేవలు మరవలేనివని అన్నారు. కార్యక్రమంలో ఎల్లేశ్ , భరత్, ఆంజనేయులు సాగర్, మధు, జితేందర్, నవీన్ రెడ్డి, సాయి పటేల్, రవి నాయక్, నరసింహ, సాయిలు, జి సత్యనారాయణ, జి. ప్రకాష్, బిజెవైఎం నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.