మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ప‌్రజలు కేవలం తెరాస పార్టీకే ఓటు వేయాలని, ఇతర ఏ పార్టీకి వేసినా ఓటు వృథా అవుతుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. గురువారం మియాపూర్ డివిజన్ పరిధిలోని జేపీనగర్‌లో డివిజన్ తెరాస అభ్యర్థి ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి కేవలం తెరాస హయాంలోనే జరిగిందన్నారు. ప్రజలు తెరాస అభ్యర్థులకు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.
నడిగడ్డ తండా వాసుల ఏకగ్రీవ తీర్మానం…
మియాపూర్ డివిజన్ తెరాస పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఉప్పలపాటి శ్రీకాంత్ కు ఓటు వేస్తామని డివిజన్ పరిధిలోని నడిగడ్డ తండా వాసులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ తెరాసకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందన్నారు. ప్రజలు తెరాస అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ తండా వాసులు స్వామి నాయక్, దశరథ్ నాయక్, కృష్ణ నాయక్, హన్మంత్ నాయక్, లక్ష్మణ్ నాయక్, రెడ్యా నాయక్, తిరుపతి నాయక్, మధు నాయక్, సీతారాం నాయక్, అబ్రహం, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.