యువ వైద్యులు డాక్ట‌ర్ బిసి రాయ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి: తాడిబోయిన రామ‌స్వామి యాద‌వ్‌

  • హెచ్‌సీయూలో ఘ‌నంగా జాతీయ‌ వైద్యుల దినోత్స‌వం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని అకాడమిక్ స్టాఫ్ కాలేజి కాన్ఫిరెస్ హాల్‌లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, హైదరాబాద్ డాక్టర్స్ ఫోరమ్ సంయుక్తంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. అసోసియేష‌న్‌ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో తూనిక రాఘవేంద్రరావు సౌజన్యంతో జ‌రిగిన ఈ కార్యక్రమంలో హెచ్‌సీయూ ప్రో-వైస్ ఛాన్సలర్ ఆచార్య బి.రాజశేఖర్, ఆచార్య వై.నర్సింహులు (డైరెక్టర్ అకడిమిక్ స్టాఫ్ కాలేజి ), డాక్టర్ బి.వి.పురోహిత్, కార్డియాలజిస్ట్ కేర్ హాస్పిటల్ డాక్టర్ ఇషాన్ అహ్మ‌ద్ ఖాన్‌ (సూపరింటెండెంట్, టిమ్స్ హాస్పిటల్)లు ముఖ్య అతిథులుగా హాజరై డాక్టర్ బిసి రాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ డాక్టర్ బిసి రాయ్ వైద్యుడిగా, మెడికల్ కాలేజి ఆచార్యుడు గా కలకత్తా యూనివర్సిటీ ఉపకులపతిగా, కలకత్తానగర మేయర్‌గా, శాసనసభ్యుడుగా, వెస్ట్ బెంగాల్ 2 వ ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు సేవ‌లందించారి అన్నారు. ఈయన మెడికల్ జర్నల్స్ ఎడిటర్ గా కూడా పనిచేశార‌ని, 1943 లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షులుగా నియమింపబడ్డారని అన్నారు. వారు అనేక హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ ట్రైనింగ్ కాలేజీలు , ముఖ్యంగా మహిళలు, పిల్లలు కు ప్రత్యేక హాస్పిటల్స్ ఏర్పాటు చేసిన మ‌హానుబావుడ‌ని గుర్తు చేశారు.

హెచ్‌సీయూలో జరిగిన జాతీయ వైద్యుల దినోత్స‌వంలో పాల్గొన్న ప్ర‌ముఖ వైద్యులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, హైదరాబాద్ డాక్టర్స్ ఫోరమ్ ప్ర‌తినిధులు

వైద్య రంగంలో డాక్ట‌ర్ బిసి రాయ్‌ అందించిన సేవలకు 1944 లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారని, భారత ప్రభుత్వం 1961 లో భారతరత్న బిరుదుతో సత్కరించి, ఆయన గౌరవార్థం 1 జులై ను జాతీయ వైద్యుల దినోత్సవంగా నిర్వహించాలని ప్ర‌క‌టించింద‌ని అన్నారు. 1976 నుండి వివిధ రంగాల్లో డాక్టర్ బిసి రాయ్ ప్రతిభ పురస్కారాలు అందజేస్తున్నారని తెలిపారు. నేటి యువ వైద్యులు ఆయన జీవితంను ఆదర్శంగా తీసుకొని రోగి పర్సు మీద కాకుండా నాడి మీద ధ్యాస పెట్టి సేవలు అందించాలని తెలిపారు. ఆయన జయంతి మరియు వర్ధంతి కూడా జులై 1 అని గుర్తు చేశారు. వైద్య రంగంలో మరిన్ని పరిశోధనలు జరిగి సామాన్యుడికి వైద్యం అందుబాటులో ఉండే విధంగా వైద్య రంగ నిపుణులు కృషిచేయాలని తెలిపారు. ఈ సమాజంలో అధ్యాపక వృత్తి తరువాత కులమత, ప్రాంతాలకు అతీతంగా అందరూ గౌరవించే వృత్తి డాక్టర్ వృత్తి అని తెలిపారు. ఈ సందర్భంగా వైద్య రంగంలో ముఖ్యంగా కోవిడ్ సమయంలో విశేషమైన సేవలు అందించిన నిమ్స్, టిమ్స్, సిజిహెచ్ఎస్, ఈఎస్ఐ, ఏరియా హాస్పిటల్ పఠాన్ చెరు, కొండాపూర్, భెల్‌, హెచ్‌సీయూ, ఉర్దూ యూనివర్సిటీ, పీహెచ్‌సీ లింగంప‌ల్లి, అర్బన్ హెల్త్ సెంటర్స్‌, ఇత‌ర‌ ప్రభుత్వ హాస్పిటల్స్‌లో విశేషమైన సేవలు అందించిన వైద్యులను శాలువ , జ్ఞాపిక , పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ డాక్టర్ల ఫోరమ్ కన్వీనర్ డాక్టర్ రవీంద్ర కుమార్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రామ్మోహనరావు, విష్ణుప్రసాద్, వాణిసాంబశివరావు, జివి రావు, ఉమా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here