- తెరాస సీనియర్ నాయకుడు గుర్ల తిరుమలేష్
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ఆపత్కాలంలో అలుపెరగకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడమే ధ్యేయంగా పనిచేస్తూ వేకువజామునే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధినిర్వహణలో నిమగ్నమై నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న శానిటేషన్ వర్కర్లకు ఎంత చేసినా తక్కువేనని టీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకుడు గుర్ల తిరుమలేష్ అన్నారు. బతుకమ్మ పండగను పురస్కరించుకుని తన వంతుగా గోపీనగర్, నెహ్రూనగర్, బాపునగర్ లలోని 30 మంది శానిటేషన్ వర్కర్లకు నూతన వస్త్రాలను గురువారం గుర్ల తిరుమలేష్ అందజేశారు.
ప్రతి కాలనీ, ప్రతి గల్లీని శుభ్రం చేస్తూ ప్రజలు రోగాల బారిన పడకుండా పరోక్షంగా శానిటేషన్ వర్కర్లు కృషి చేస్తున్నారన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు సైతం నగరాన్ని శుభ్రంగా ఉంచుతున్న శానిటేషన్ వర్కర్లంటే ఎనలేని అభిమానం అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో యావత్ ప్రపంచమంతా ఇళ్లకే పరిమితమైతే శానిటేషన్ సిబ్బంది మాత్రం ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం కురిసిన వర్షాలకు వరద నీటి ప్రవాహంతో కాలనీల్లోకి, రోడ్లపైకి కొట్టుకువచ్చిన చెత్తాచెదారం, వ్యర్థ పదార్థాలు, మట్టిని తొలగించడంలో శానిటేషన్ సిబ్బంది తలమునకలై సాధారణ స్థితికి తీసుకువచ్చారన్నారు. ఇలాంటి వారికి ఉడతా భక్తిగా తన వంతుగా సహాయం చేయడం గర్వంగా ఉందని తిరుమలేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు కలివేముల వీరేశం గౌడ్, సుధాకర్, శ్రీకాంత్ గౌడ్, నవీన్ గౌడ్, చిన్నా ముదిరాజ్, ఎస్ఎఫ్ఏ వినయ్, భిక్షపతి, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.