నమస్తే శేరిలింగంపల్లి: పేదలకు ఇళ్ల పట్టాలిస్తామని ప్రభుత్వాలు మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకోవడమే తప్పా చేసిందేమి లేదని ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ వనం సుధాకర్ అన్నారు. శేరిలింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలోని గల పేదలు నివాసాలు ఉంటున్న బస్తీలలో 58 జీవో ప్రకారం పట్టాలు ఇవ్వాలని శేరిలింగంపల్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఎంసీపీఐ (యు) మియాపూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆయా బస్తీల ప్రజలతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ వనం సుధాకర్ మాట్లాడుతూ గత టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వాల నుంచి నేటి టీఆర్ఎస్ ప్రభుత్వం వరకు 45 ఏళ్లుగా ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్న పేద ప్రజలకు ఇళ్లపట్టాలిస్తామని అనేక జీఓలను తీసుకొచ్చి మభ్యపెట్టి మోసం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలపై ఎంసీపీఐయూ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి మండల పరిధిలో 40 సంవత్సరాలుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే మియాపూర్ ప్రాంతంలోని నడిగడ్డ తాండ, పోగుల ఆగయ్య నగర్, టేకు నరసింహనగర్, స్టాలిన్ నగర్, ముజాఫర్ అహ్మద్ నగర్, ఓంకార్ నగర్, సుభాష్ చంద్రబోస్ నగర్ లోని పేదలు పెట్టుకున్న దరఖాస్తులకు ఇంటి పట్టాలు ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు పేద ప్రజల నివాసాలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని ప్రజల డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వి.తుకారాం నాయక్ మాట్లాడుతూ మియాపూర్ 28 సర్వేనెంబర్ పరిధిలో 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నడిగడ్డ తండాలో, సుభాష్ చంద్రబోస్ నగర్ లో ఓంకార్ నగర్ లో భారీ వర్షాలతో ప్రజల ఇండ్లు పునర్నిర్మాణం చేసుకుంటుంటే అవసరాల కోసం బాత్రూంలో కట్టుకుంటుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అండతో అక్కడ ఏర్పడిన సి ఆర్.పి.ఎఫ్ సిబ్బంది ప్రజలపై భౌతికంగా దాడులకు దిగుతున్నారని వాపోయారు. అనేకసార్లు స్థానిక జిల్లా కలెక్టర్ కు విన్నవించుకున్న ఫలితం లేదన్నారు. కేంద్రం, రాష్ట్రం సీఆర్పీఎఫ్ క్యాంపు తీసేయడానికి తక్షణ చర్యల కోసం స్థానిక రెవెన్యూ అధికారులు సంబంధిత రికార్డులను ప్రభుత్వానికి ఇచ్చి క్యాంపును అక్కడ నుంచి తొలగించి ప్రజల నివాసాలకు కనీస రక్షణ కల్పించాలని అన్నారు. మియాపూర్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ కన్నా శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంటి పట్టాలతో పాటు నూతన రేషన్ కార్డులు, రేషన్ కార్డులో సరి చేయవలసిన పేర్లు తదితర అంశాలను వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం రెవెన్యూ అధికారులకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ధర్నాలో ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కుంభం సుకన్య, గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి మైదం శెట్టి రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుడుం అనిల్ కుమార్, దానయ్య, ఈ దశరథ్ నాయక్, నాయకులు విమల, మధుసూదన్, రంగస్వామి, సుల్తానా బేగం, శివాని, లక్ష్మీ నరసింహ, లలిత, అంజయ్య, చందర్, శరణప్ప, బుసాని రవి, ఎన్ నాగభూషణం, గుడిసె శ్రీనివాస్, అసనుద్దీన్, వెంకటేష్, రవికాంత్, అనిత, శ్రీలత, రాజు, ఇస్సాకు, జంగయ్య ఆయా బస్తీల ప్రజలు హాజరయ్యారు.