శేరిలింగంపల్లి, జూలై 15 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండలం నానక్‌రాంగూడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 149లో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల కబ్జా నుంచి రక్షించాలని కోరుతూ సీపీఎం శేరిలింగంపల్లి కార్యదర్శి చల్లా శోభన్, కార్యవర్గ సభ్యులు కొంగరి కృష్ణ, వి.మాణిక్యం, ఎస్.వరుణ్‌లు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సదరు సర్వే నంబర్‌లో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించారని అన్నారు. జీవో 59ను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ భూమిని కాజేశారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో గజం భూమి ధర దాదాపుగా రూ.2 లక్షల వరకు ఉందన్నారు. దీనికి గాను నామమాత్రంగా ఫీజు తీసుకుని రెగ్యులరైజ్ చేశారని తెలిపారు. దీని గురించి పట్టించుకునేవారే లేరని, ఎంక్వయిరీ చేసే వారు కరువయ్యారని అన్నారు. ఇది అదనుగా చేసుకుని స్థానిక రెవెన్యూ అధికారులు సైతం రెచ్చిపోతున్నారని అన్నారు. ఈ కుంభ కోణంలో అధికారులు బినామీలుగా ఉండి వ్యవహారం మొత్తాన్ని నడిపిస్తున్నారని తమకు అనుమానంగా ఉందన్నారు. లక్షల రూపాయల ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటున్న అధికారులు ప్రభుత్వ భూములను రక్షించడంలో మాత్రం విఫలమవుతున్నారని, ఆక్రమణదారులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఈ కుంభ కోణంపై విచారణ జరిపించాలని కోరినట్లు తెలిపారు.
పేదలకు ఇండ్ల స్థలాలను కేటాయించాలి..
శేరిలింగంపల్లి నియోజకవర్గం గోపన్‌పల్లి గ్రామంలో బసవ తారక నగర్ సర్వే నంబర్ 37లో ఉన్న 8 ఎకరాల స్థలంలో ఎంతో కాలంగా నివాసం ఉంటున్న పేదలకు ఇండ్ల స్థలాలను కేటాయించాలని, వారికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, జిల్లా కార్యదర్శి పి.యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.జగదీష్, శేరిలింగంపల్లి కార్యదర్శి సి.శోభన్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సదరు స్థలంలో 30 సంవత్సరాల నుంచి 250 మంది పేద కుటుంబాలు నివసిస్తున్నాయని అన్నారు. వారికి తాగునీరు, విద్యుత్ కనెక్షన్స్ ఉన్నట్లు తెలిపారు. ఓటర్, ఆధార్ తదితర ఐడీ కార్డులు ఉన్నాయని, చనిపోయిన తమ కుటుంబీకుల సమాధులు కూడా స్థానిక శ్మశానవాటికలో ఉన్నాయని వివరించారు. ఆ స్థలంలో దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్న నిరుపేదలకు ఇండ్ల స్థలాలను కేటాయించాలని, ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణ, అగ్రిప్ప, అనిల్, జంగయ్య, శివన్న, శాంతమ్మ, శారద పాల్గొన్నారు.