శేరిలింగంపల్లి, మార్చి 24 (నమస్తే శేరిలింగంపల్లి): మసీదు బండ డివిజన్ పరిధిలోని కాంతివనం కాలనీ మూలమలుపు వైన్స్ కు ఎదురుగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణంపై అధికారులు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. సదరు స్థలంలో ఐదు అంతస్తుల అక్రమ నిర్మాణాన్ని చేపట్టారని, దానిపై మళ్లీ రెండు అంతస్తులను నిర్మిస్తున్నారని, గతంలో తాము ఫిబ్రవరి 16న ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ కనీసం అధికారులు అటు చూసిన దాఖలాలు లేవని అన్నారు. మళ్లీ మార్చి 23న ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని, దాదాపు 45 రోజులు ముగిసినా అధికారులు ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం విడ్డూరమని అన్నారు. భవన నిర్మాణదారుడు మరో రెండు అంతస్తులను అదనంగా నిర్మిస్తున్నాడని, అధికారులు నిర్లక్ష్య వైఖరిని వీడి అక్రమ నిర్మాణాల పట్ల చర్యలు తీసుకోవాలని అన్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించాలని అన్నారు.






