నమస్తే శేరిలింగంపల్లి: సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆద్వర్యంలో సైబరాబాద్ పరిధిలోని 100 గేటెడ్ కమ్యూనిటీలో సంక్షేమ సంఘాల పెద్దలతో కమిషనర్ వీసీ సజ్జనార్ ఆదివారం ఆన్‌లైన్‌లో సమావేశం అయ్యారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో గేటెడ్ కమ్యూనిటీ వాసులకు ఆయన పలు సూచనలు సలహాలు అందజేశారు. కరోనా కట్టడి కోరకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. సదరు గేటెడ్ కమ్యూనిటీలలో కరోనా నియంత్రణకు వారు అవలంభిస్తున్న అంశాలను సంక్షేమ సంఘాల పెద్దలు కమిషనర్‌కు వివరించారు. ఈ నెపథ్యంలో వారు పోలీసుల నుంచి పలు సహకారాలు కోరారు. ప్రధానంగా అత్యవసర సమయాల్లో స్పందించేందుకు ప్రత్యేక అధికారిని కేటాయించాలని, కరోనా కట్టడి కోసం ఆడియో ప్రకటనలు విడుదల చేయాలని, సకాలంలో కరోనా క్రిమి సంహారక మందులు పిచికారి అయ్యేలా చూడాలని, కరోనా పరీక్ష సౌకర్యాలు కల్పించాలని, తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా టీకా పంపిణీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో గేటెడ్ కమ్యూనిటీలలో ప్రత్యేక కేంద్రాల ద్వారా టీకా ఇప్పించాలని వారు కోరారు.
దీంతో వారి అభ్యర్థనలకు సానుకూలంగా స్పందించిన కమిషనర్ సజ్జనార్ సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సౌకర్యాలన్ని కల్పించేలా చూస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎస్‌సీఎస్‌సీ సెక్రటరీ జనరల్ కృష్ణ యేడులా మాట్లాడుతూ సకాలంలో మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే అంబులెన్స్ సేవలను ప్రారంభించామని, అదేవిధంగా ప్రతి గేటెడ్ కమ్యూనిటీ అంబులెన్స్‌ను అద్దెకు తీసుకోగలిగితే అది వారి స్వంత సంఘాలలో నివసించే చాలా మందికి సహాయపడుతుందని అన్నారు. ట్రాఫిక్ డీసీపీ సి.ఎం.విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత కోవిడ్ విస్తరిత కాలంలో సైతం ట్రాఫిక్ ఉల్లంఘనల వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నయని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, డ్రంక్ ఆండ్ డ్రైవ్ అదేవిధంగా మైనర్లను వాహనాలను నడపడానికి అనుమతించవద్దు సూచించారు. ఈ సమావేశంలో 40 సంక్షేమ సంఘాల బృందానికి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ సాయి రవిశంకర్ మైహోమ్ జ్యువెల్, సిల్వర్ ఓక్స్, రాజపుష్ప అట్రియా, అపర్ణ టవర్స్, భవ్యాస్, ఎస్ఎంఆర్ వినయ్, అపర్ణ సైబర్ కమ్యూన్ ఇతర గేటెడ్ కమ్యూనిటీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.