నమస్తే శేరిలింగంపల్లి: హుజురాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయం ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడినట్లని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపును పురస్కరించుకొని గచ్చిబౌలి కార్పొరేటర్ కార్యాలయం లో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి అధ్వర్యంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు బాణాసంచాలు కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్బంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కెసిఆర్ నియంత పాలనను ప్రజలు అణగదొక్కేందుకు కంకణం కట్టుకున్నారని విమర్శించారు. హుజురాబాద్ ఎన్నికలతో ప్రజలు సీఎం కేసీఆర్ కి తగిన బుద్ది చెప్పి ఈటెల రాజేందర్ గెలుపునకు కృషి చేశారని అన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. వచ్చే ఎన్నికలలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీని ఢీ కొట్టిన ఈటల రాజేందర్ కాషాయం కండువాతో శాసనసభలో అడుగుపెట్టనున్నారని తెలిపారు. దుబ్బాక ఎన్నికల్లో రఘునందన్ గెలుపుతో ప్రారంభమైన బిజెపి ప్రభంజనం ఈటెల గెలుపుతో దూసుకుపోతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, వివిధ మోర్చా నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.