నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో మంజూరైన ఏడు మురుగు నీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నిర్మాణము కోసం స్థలాలను పరిశీలించాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఎస్టీపీల నిర్మాణాలకు స్థల పరిశీలన, అనుసరించాల్సిన విధానాల పై కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ తో పాటు జలమండలి ఎస్టీపీ విభాగం అధికారులతో సోమవారం ప్రభుత్వ విప్ గాంధీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఏడు ఎస్టీపీలను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. చెరువులు కలుషితం కాకుండా మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి చెరువులను సస్యశ్యామలం చేయాలని, ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఎస్టీపీల నిర్మాణం కొరకు స్థలాల పరిశీలన కోసం క్షేత్ర స్థాయిలోకి వెళ్లి స్థలాలను పరిశీలిస్తామని గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని రూ. 26.27 కోట్ల అంచనా వ్యయంతో 7 ఎంఎల్ డి సామర్థ్యం తో మియాపూర్ పటేల్ చెరువు వద్ద రూ. 64.14 కోట్ల అంచనా వ్యయంతో 20 ఎంఎల్ డీ సామర్థ్యం తో గంగారాం పెద్ద చెరువు వద్ద ఎస్ టీ పీ లు మంజూరయ్యాయని వివరించారు. దుర్గం చెరువు వద్ద రూ. 25.67 కోట్ల అంచనా వ్యయంతో 7 ఎంఎల్ డీ సామర్థ్యం ఎస్టీపీ, ఖాజాగుడా చెరువు వద్ద రూ. 61.25 కోట్లతో 21 ఎంఎల్ డీ సామర్థ్యం గల ఎస్టీపీ, అంబిర్ చెరువు వద్ద రూ. 100.87 కోట్ల అంచనా వ్యయంతో 37 ఎంఎల్ డీ సామర్థ్యం గల ఎస్టీపీ, ఎల్లమ్మ కుంట చెరువు జయనగర్ వద్ద రూ. 43.46 కోట్ల నిధులతో 13.50 ఎంఎల్ డీ సామర్థ్యం గల ఎస్టీపీ, పరికి చెరువు రూ. 83.05 కోట్ల అంచనావ్యయం తో 28 ఎంఎల్ డీ సామర్థ్యం గల ఎస్టీపీలు మంజూరైనట్లు తెలిపారు. ఈ సమావేశంలో జలమండలి ఎస్టీపీ విభాగం డీఈ లు దీపాలి, రజిని తదితరులు పాల్గొన్నారు.