నమస్తే శేరిలింగంపల్లి: వర్షాకాలంలో విజృంభించే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధి గోపనపల్లి లోని తన నివాసం లో ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు. ఇంటి ఆవరణలోని ప్లాస్టిక్ డ్రమ్స్ లో, పూల తొట్టిల్లో నిలిచిన నీటిని జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండడంతో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రభలుతాయన్నారు. వీటి నివారణ కోసం ప్రజలందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ నగర్, తాజ్ నగర్, సోఫా కాలనీ సొసైటీ కార్యదర్శి నరసింహారెడ్డి, ఎంటమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్ విశ్వా ప్రసాద్, జీహెచ్ఎంసీ సిబ్బంది రవీందర్, వెంకటయ్య, అన్వర్ పాల్గొన్నారు.