ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి: ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో‌ ఆదివారం ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవాన్ని నిర్వహించారు. నల్లగండ్ల సిటిజన్స్ ఆస్పత్రి వారి సౌజన్యంతో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్ మెహర్ పార్కులో ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు చేశారు. కన్వీనర్ తాడి బోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కువ మంది డయాబెటిస్‌ వ్యాధితో బాధపడుతున్నారని అన్నారు. ఈ వ్యాధి ఎక్కువగా చైనా, ఇండియా, అమెరికా, ఇండోనేషియా, పాకిస్తాన్, బ్రెజిల్, బంగ్లాదేశ్, రష్యా, మెక్సికో, జపాన్ దేశాలు ప్రపంచంలోనే మొదటి పది స్థానాల్లో ఉన్నాయన్నారు .ఈ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తోందని, దీనివలన ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది చనిపోతున్నారని ఆవేధన చెందారు. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించ లేకపోవడం వలన ఈ వ్యాధి సోకుతుందని, మూడు రకాలుగా ఉంటుందన్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా అన్ని వయస్సుల వారికి మదుమేహం సోకుతుందని చెప్పారు. వ్యాధి లక్షణాలు చర్మం పొడిబారటం, దురద గాయాలు మానకపోవడం, చూపు మందగించడం, అధిక దాహం, ఎక్కువగా మూత్ర విసర్జన, బరువు తగ్గుట తదితర లక్షణాలు కనిపిస్తాయన్నారు. మధుమేహ వ్యాధి ఊబకాయం ఎక్కువగా ఉన్నవారికి అధిక రక్తపోటు ఉన్న వారికి, స్మోకింగ్ చేసేవారికి, శారీరక శ్రమ లేని వారికి, మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నవారికి, జంక్ ఫుడ్డు తినేవారికి, దుంపకూరలు, వైట్ రైస్, పిండి పదార్థాలు అధికంగా తీసుకునే వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ అని రామస్వామి యాదవ్ వివరించారు. ఈ వ్యాధి వలన రక్తనాళాలు దెబ్బతిని రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వలన చూపు కోల్పోవడం, అరి కాళ్లకు ఇన్ఫెక్షన్ రావడం, మూత్రపిండాలు దెబ్బతినడం, గుండె పోటు పక్షవాతం లాంటి జబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు .అందుకని ఈ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం కావున వ్యాధి నియంత్రణకు నిత్యం యోగ, నడక, ధ్యానం, పీచు పదార్థాలు ఎక్కువ కలిగిన ఆహారాలు తీసుకోవడం, డ్రై ఫ్రూట్స్, చేపలు, గ్రుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, సమయపాలన పాటించడం తాజా ఆకు కూరలు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, తాజా పళ్ళు తీసుకొని ఈ వ్యాధిని నియంత్రించవచ్చు అని తెలిపారు .షుగర్ లెవెల్స్ ఫాస్టింగ్ 70-110mg/dl, పోస్ట్ లంచ్ 110/160mg/dl, బిపి నార్మల్ రేంజ్ 120/ 80 ఉంటే ఈ వ్యాధి నియంత్రణ ఉన్నట్టని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరు నెలలకు ఒకసారి ఈ షుగరు పరీక్షలు చేయించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. వ్యాధి లక్షణాలు ఉన్న ఎడల వైద్యున్ని సంప్రదించి సలహాలు సూచనలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. పర్యావరణంలో వస్తున్న మార్పుల వలన ఇండియాలో ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో ఈ వ్యాధి ఎక్కువగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గుల్మొహర్ పార్క్ కాలనీ అసోసియేషన్ నాయకులు షేక్ ఖాసిం, నిరంజన్ రెడ్డి, మోహన్ రావు , ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, జనార్ధన్, పాలం శ్రీను హాస్పిటల్ ప్రతినిధి జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

గుల్ మొహర్ పార్కులో షుగర్ పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here