నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి కింద మ్యాన్ హోల్స్ ప్రమాదకరంగా మారాయని, జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాత్రి లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలోని మ్యాన్ హోల్ లో ఓ వ్యక్తి పడిపోయి బాధపడుతున్న విషయాన్ని గమనించిన బిజెపి చందానగర్ డివిజన్ ఉపాధ్యక్షుడు పగడాల వేణుగోపాల్ ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర రెడ్డి హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్నారు.

పరిస్థితిని సమీక్షించిన కసిరెడ్డి భాస్కర రెడ్డి మ్యాన్ హోల్ లో ఓ వ్యక్తి దిగినట్లు ఆనవాళ్లు గుర్తించారు. మూడు మ్యాన్ హోల్స్ ప్రమాదకరంగా ఉన్నాయని, వాటిపై కనీసం కప్పు లేకుండా ఉండడం, ప్రమాద సూచికలను సైతం ఏర్పాటు చేయకపోవడం దారుణమని అన్నారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్యం పట్ల కసిరెడ్డి భాస్కర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాన్ హోల్స్ లోకి దిగిన వ్యక్తి ఈ ప్రమాదకరమైన సమస్యను వెలుగులోకి తీసుకురావడానికి ఇలా చేసినట్లు తెలిపారని అన్నారు. సాప్ట్ వేర్ ఉద్యోగి ఫణి సహాయంతో కసిరెడ్డి భాస్కర రెడ్డి రక్షణ ఏర్పాట్లు చేశారు.
