నమస్తే శేరిలింగంపల్లి: బీహెచ్ఈఎల్ ఎంఐజి కాలనీలోని ఇందిరా మహిళా మండలి కార్యాలయంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడి బోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో సిటిజన్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మహిళలకు గైనిక్, మోనోపాజ్ సమస్యలపై శనివారం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్టు డాక్టర్ అండాల్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహిళలు సాధారణంగా వైట్ డిశ్చార్జ్ అలాగే పీరియడ్స్ క్రమం తప్పి రావడం, పీరియడ్స్ లేటుగా, ముందుగా రావడం, ఓవర్ డిశ్చార్జ్, పొత్తి కడుపు నొప్పి, యూరినరీ ట్రాక్ట్ ప్రాబ్లమ్స్ పై మహిళలు అడిగిన సమస్యలకు డాక్టర్ అండాల్ రెడ్డి సమాధానాలు ఇచ్చారు. మోనోపాజ్ (రుతుక్రమం ఆగిపోవడం) తరువాత మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై డాక్టర్ అండాల్ రెడ్డి స్పందిస్తూ మోనోపాజ్ సాధారణంగా 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వారికి వస్తుందని, ఇటీవల కాలంలో జీవన ప్రమాణం పెరగడం వల్ల 55 సంవత్సరాల వారికి సైతం ఈ సమస్య వస్తుందన్నారు.
మోనోపాజ్ అనేది మూడు రకాలుగా ఒకటి సహజంగా, రెండు ముందుగా, మూడు ఆలస్యంగా ఉంటుందన్నారు. మోనోపాజ్ వచ్చిన మహిళలల్లో చికాకు, దురద, కండరాల నొప్పులు, జాయింట్ పెయిన్స్, కోపం, డిప్రెషన్ కు గురి కావడం, శరీరం హఠాత్తుగా వేడెక్కడం, చెమటలు రావడం లాంటి లక్షణాలు కనబడుతుంటాయని చెప్పారు. రుతుక్రమం ఆగిపోవడం వలన శరీరంలో వచ్చిన మార్పుల వలన శరీరమంతా డ్రై అయి యూరినరీ ట్రాక్ కుచించుకు పోవడం వలన యూరిన్ పాస్ చేసినప్పుడు మంట నొప్పి కలుగుతుంటాయన్నారు. చెడు కొలెస్ట్రాల్ శరీరంలో నిల్వ ఉండిపోయి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇది మహిళలకు సాధారణమైన సమస్య అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మోనోపాజ్ సమస్యల నివారణకు మంచి పోషక ఆహారం తీసుకోవాలని, కాల్షియం అధికంగా ఉండే పాలు, పాల ఉత్పత్తులు, తాజా ఆకుకూరలు, చేపలు, పండ్లు లాంటి ఆహారాలు తీసుకొని నిత్యం యోగా, ధ్యానం, నడక వ్యాయామం చేయాలన్నారు. పీరియడ్స్ సమయంలో ఉపయోగించే ప్యాడ్స్ ను ప్రతి ఐదు గంటలకు ఒకసారి మార్చుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇందిరా మహిళా మండలి అధ్యక్షురాలు జ్యోతి, మాజీ కౌన్సిలర్ నాగమణి, రాణి యాదవ్, సంధ్య, అనిత, రాధ, కళావతి, బి. లక్ష్మి , హంస పాటిల్, మహిళా నాయకురాలు, హాస్పిటల్ ప్రతినిధి జాకీర్, మూర్తి, యోగా టీచర్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.