నమస్తే శేరిలింగంపల్లి: ఉద్యోగ సాధనలో యువతకు పేదరికం అడ్డుకాకూడదనే ఉద్దేశ్యంతో ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ ప్రకటన నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నిరుపేద నిరుద్యోగ యువతీ యువకులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో స్వంత నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ శిబిరంలో అర్హత సాధించేందుకు మియాపూర్ లోని గౌతమి పాఠశాలలో ప్రాథమిక అర్హత పరీక్షను నిర్వహించారు. పరీక్షా కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ ప్రకటన నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నిరుపేద నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ శిబిరం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్ , టీఎస్ పీఎస్ సీ, గ్రూప్స్ కు, ఇతర పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే నిరుద్యోగులు ఉచిత శిక్షణ శిబిరంలో శిక్షణ పొందేందుకు అర్హత సాధించాల్సి ఉంటుందన్నారు. రాత పరీక్షల్లో ఎంపికైన వారికి ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. శారీరక దారుఢ్య పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహిస్తామన్నారు. నైపుణ్యం గల నిపుణులచే శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, ఉద్యోగ అర్హత పరీక్షలకు అర్హత సాధించి ఉద్యోగం సాధించేలా యువకులు పట్టుదలతో, సరైన క్రమ శిక్షణ తో నిరంతరం పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాలని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.